భారత్ సమాచార్, డిజిటల్: గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో బుధవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు నగరంలోని 10 ప్రముఖ పాఠశాలలకు ఒకేసారి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పశ్చిమ అహ్మదాబాద్‌లోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఈ మెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
బెదిరింపు సమాచారం అందిన వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు పంపించారు. మరోవైపు నరేంద్ర మోదీ స్టేడియంలోనూ భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో స్టేడియం పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
స్టేడియంలోనే U-19 మ్యాచ్
బెదిరింపులు వచ్చిన సమయంలో నరేంద్ర మోదీ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్ U-19, ఆస్ట్రేలియా U-19 జట్లు ఉన్నాయి. ఉదయం 11:15 గంటలకు యూత్ టెస్ట్ మ్యాచ్ ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇరు జట్ల క్రీడాకారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ బస ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు.
ఇదిలా ఉండగా నవంబర్ 21న నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రముఖ గాయకుడు దిల్‌జీత్ దోసాంజ్ సంగీత విభావరి జరగాల్సి ఉంది. ఈ కన్సర్ట్‌కు హాజరయ్యే వారికి రక్షణ ఉండదంటూ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
రంగంలోకి బాంబ్ స్క్వాడ్
బాంబు బెదిరింపుల విషయం తెలిసిన వెంటనే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ సైబర్ క్రైమ్ పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. దీంతో బాంబు నిర్వీర్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ భద్రతా పరిస్థితిని పరిశీలించారు.
ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపు ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.