భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యుత్ సమస్యపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు కాసాల చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రైతులు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పంటలకు అవసరమైన సమయంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో పాటు లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా వేధిస్తోందని రైతులు తెలిపారు. దీంతో వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు రిపేర్ చేయించుకోవడం, అవసరమైనప్పుడు కొత్త మోటార్లు ఏర్పాటు చేసుకోవడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని చెప్పారు.
మరోవైపు పొట్ట దశకు చేరుకున్న వరి పంటలకు సకాలంలో నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశామని, ఇప్పుడు కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేక పంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు పంటకు అవసరమైన సమయంలో విద్యుత్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని రైతు సంఘం నాయకులు తెలిపారు. లో వోల్టేజ్ సమస్యను వెంటనే పరిష్కరించడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.