భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ట్రాక్టర్ మోటార్లు, జనరేటర్లతో నీటి సరఫరా

కరెంటు కోతలతో అల్లాడుతున్న నర్సాపూర్ రైతులు.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరి పొలాలకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొందరు రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనలకు దిగుతుండగా.. మరికొందరు రైతులు మాత్రం పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ట్రాక్టర్లకు మోటార్లు బిగించడం, జనరేటర్లను వినియోగించడం ద్వారా బోర్లు, బావుల నుంచి పొలాలకు నీటిని తరలిస్తున్నారు.

నర్సాపూర్ ప్రాంతంలో విద్యుత్ కోతల ప్రభావం వరి పంటలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే ఎండలు మండిపోతుండటంతో వరి పంటలకు నిరంతరం నీరు అవసరమైన పరిస్థితి ఉంది. అయితే విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పొలాలకు సకాలంలో నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

నాలుగు ఎకరాల పంట కోసం.. ట్రాక్టర్‌తో నీటి తిప్పలు

నర్సాపూర్‌కు చెందిన రైతు శ్రీపాల్ నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశారు. పంటకు అవసరమైన సమయంలో విద్యుత్ సరిగా అందకపోవడంతో బావి నుంచి పొలానికి నీరు పారించేందుకు ట్రాక్టర్‌కు మిషన్ బిగించాల్సి వచ్చింది. ట్రాక్టర్ సాయంతో బావి నుంచి నీటిని తోడి వరి పొలానికి పారబెడుతున్నారు.

కరెంట్‌పై ఆధారపడితే పంట ఎండిపోయే పరిస్థితి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధానాన్ని ఆశ్రయిస్తున్నట్లు రైతు శ్రీపాల్ శ్రీకాంత్ రాజు యాదవ్ తెలిపారు. అయితే ట్రాక్టర్ వినియోగం వల్ల అదనపు ఖర్చు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజులకు ట్రాక్టర్ డీజిల్‌కే సుమారు రూ.2 వేల వరకు ఖర్చవుతోందని తెలిపారు.

ఐదు ఎకరాలు ఎండిపోయాయి.. మిగిలిన పంట కోసం జనరేటర్

నర్సాపూర్ మండలం మాడాపూర్ గ్రామానికి చెందిన రైతు ఖదీర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఖదీర్ సుమారు 10 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అయితే కరెంట్ సక్రమంగా లేకపోవడంతో పంటకు అవసరమైన సమయంలో నీరు అందలేదు. దీంతో ఇప్పటికే సుమారు ఐదు ఎకరాల వరి పంట ఎండిపోయిందని రైతు తెలిపారు.

మిగిలిన ఐదు ఎకరాల పంటనైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో బోర్‌కు జనరేటర్ కనెక్షన్ ఇచ్చి పొలానికి నీరు పారబెడుతున్నారు. జనరేటర్ కిరాయి, డీజిల్ ఖర్చు కలిపి రోజుకు సుమారు రూ.1,500 వరకు అదనపు భారం పడుతోందని రైతు ఖదీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్ కోసం రైతుల ఆందోళన

పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొనగా.. మరోవైపు వాటిని కాపాడుకునేందుకు ట్రాక్టర్లు, జనరేటర్లపై అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు స్పందించి పంటలకు అవసరమైన సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని నర్సాపూర్ ప్రాంత రైతులు కోరుతున్నారు.