భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు కనీసం 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ BRS ఆధ్వర్యంలో నిజాంపేటలో నిరసన చేపట్టారు. BRS మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిజాంపేట సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించి నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ MLA పద్మాదేవేందర్‌రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సరిపడా కరెంటు ఇవ్వడం లేదని ఫైరయ్యారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పండించేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటే.. విద్యుత్ కోతలతో వారి శ్రమ వృథా అవుతోందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు అందించి వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని తిరుపతిరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన ఘనత BRS ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి పెట్టి కనీసం 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు 12 గంటల కరెంటు అందించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని తిరుపతిరెడ్డి హెచ్చరించారు. మరో రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
హామీలు అమలు చేయాలని పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్
మాజీ MLA పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి 12 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
12 గంటల కరెంటుకు హామీ
ఆందోళన కొనసాగుతున్న సమయంలో రామాయంపేట AE ఆదయ్య అక్కడికి చేరుకున్నారు. కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డితో ఆయన చర్చించారు. రైతులకు 12 గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో BRS నాయకులు, కార్యకర్తలు ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో రైతులు, మండలంలోని సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు, రైతులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.