భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

నార్సింగిలో విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

15 గంటల విద్యుత్ ఇవ్వకుంటే రహదారి దిగ్బంధం చేస్తాం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండల కేంద్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

సబ్‌స్టేషన్‌లో పరిస్థితిపై ఆరా

రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకునేందుకు MLA కొత్త ప్రభాకర్ రెడ్డి సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ విద్యుత్ సరఫరా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లోని లాక్ బుక్‌ను పరిశీలించిన ఆయన.. మండలంలోని రైతులకు రోజులో ఎన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా అవుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్ కోతల కారణంగా సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు MLA దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ అందకపోవడం బాధాకరమని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రైతుల పంటలు కళ్ల ముందే ఎండిపోతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదన్నారు.

15 గంటల కరెంట్ ఇవ్వాలని సూచన

ఈ సందర్భంగా AE, ADE, SE స్థాయి విద్యుత్ అధికారులతో MLA మాట్లాడారు. మండలంలోని రైతులకు రోజుకు 15 గంటల విద్యుత్ సరఫరా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్‌లోడ్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

15 గంటల విద్యుత్ ఇవ్వకుంటే రహదారి దిగ్బంధం చేస్తాం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

హామీ అమలు చేయాల్సిందే..

నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన అనంతరం సంబంధిత IAS అధికారితో కూడా మాట్లాడినట్లు MLA కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రైతులకు 15 గంటల విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు 15 గంటల కరెంట్‌ను నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు.

ప్రజలపై రూ.5,420 కోట్ల అదనపు విద్యుత్ భారం మోపే అంశాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. ఒకవైపు రైతులు విద్యుత్ కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ప్రజలపై అదనపు భారం మోపడం సరికాదన్నారు.

రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తాం

రైతులకు, ప్రజలకు 15 గంటల విద్యుత్ హామీ అమలు కాకపోతే రైతుల పక్షాన నిలబడి తదుపరి కార్యాచరణ చేపడతామని కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 9 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.