భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పూల జాతరతో పాఠశాలలు కళకళ.. బతుకమ్మ సంబరాలు

పూల జాతరతో పాఠశాలలు కళకళ.. బతుకమ్మ సంబరాలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రాంగణాలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో కళకళలాడాయి. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల పూలను తీసుకువచ్చి అందంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

పూల జాతరతో పాఠశాలలు కళకళ.. బతుకమ్మ సంబరాలు

వేడుకలకు ముందు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. పండుగల ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించవచ్చని తెలిపారు.

నెల్లికుదురు ప్రభుత్వ పాఠశాలల్లో వేడుకలు

పూల జాతరతో పాఠశాలలు కళకళ.. బతుకమ్మ సంబరాలు

నెల్లికుదురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక హెచ్ఎం వాణిశ్రీ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అలాగే నరసింహులగూడెం యూపీఎస్‌లో హెచ్ఎం పద్మావతి, జెడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్ఎం జలగం శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొని బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడిపాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.

పూల జాతరతో పాఠశాలలు కళకళ.. బతుకమ్మ సంబరాలు

మేచరాజుపల్లి పాఠశాలలో పూల సందడి

మేచరాజుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్ఎం మంగతాయి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. సౌండ్ బాక్సుల్లో వినిపించిన బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ వేడుకల్లో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

పూల జాతరతో పాఠశాలలు కళకళ.. బతుకమ్మ సంబరాలు

వావిలాల యూపీఎస్‌లో బతుకమ్మ, విజయదశమి వేడుకలు

వావిలాల యూపీఎస్‌లో హెచ్ఎం అడప కరుణాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మతో పాటు ముందస్తు విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్, ఏఏపీసీ చైర్మన్ యమున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి వారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు. పాఠశాలల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో విద్యార్థులకు తెలంగాణ సంప్రదాయాలు, పండుగల విశిష్టతపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.