భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి, కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ పాటలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఉత్సాహం, రంగురంగుల పూలతో వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.
ప్రకృతిని పూజించే గొప్ప సంప్రదాయం
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ, ప్రకృతిని దైవంగా, పూలను దేవతలుగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం బతుకమ్మ పండుగలో కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రత్యేక గుర్తింపు అని చెప్పారు. బతుకమ్మలో ఉపయోగించే పూలు, ఆకులు, పసుపు, కుంకుమకు సంప్రదాయపరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉందని విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా తంగేడు పువ్వుకు ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.
వేడుకల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు
ఈ కార్యక్రమంలో శిరీష, అప్సర, నవ్య, షాహిన్, శ్రీలత, స్రవంతితో పాటు పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారులకు తెలంగాణ పండుగల విశిష్టత, ప్రకృతి ప్రాధాన్యత, మన సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.