భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఇనుగుర్తి మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం నిర్వహించిన ముందస్తు బతుకమ్మ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గంజి అర్చన రెడ్డి తెలిపారు.
రంగురంగుల పూలతో బతుకమ్మలు.. కోలాటాలతో సందడి
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో వివిధ రకాల పూలను సేకరించి సంప్రదాయ పద్ధతిలో అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలకు అనుగుణంగా కోలాటాలు వేస్తూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల మధ్య పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయం
బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంప్రదాయమని ప్రిన్సిపాల్ అర్చన రెడ్డి తెలిపారు. పూలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులకు తెలంగాణ పండుగల విశిష్టత, మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెనగండ్ల చంద్రమోహన్, తోట అనిత, బోళ్ళ సుజాత, ఉడుత శ్వేత, కదిరి రమ్య, గుండ్రపల్లి స్రవంతి, కోరుకొండ కావ్యతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.