భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఇనుగుర్తి ZPHS విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 70వ SGF రాష్ట్రస్థాయి టెన్నిస్, గట్కా పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు అర్హత సాధించినట్లు పాఠశాల హెచ్ఎం అమ్మ యాకయ్య తెలిపారు.
జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ
శుక్రవారం ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్‌తో కలిసి హెచ్ఎం అమ్మ యాకయ్య వివరాలు వెల్లడించారు. ఇటీవల హన్మకొండలోని JNS స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సెలక్షన్లలో ఇనుగుర్తి ZPHS విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. తమ ఆటతీరుతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు.
టెన్నిస్‌లో ముగ్గురికి అవకాశం
టెన్నిస్ అండర్-17 విభాగంలో పదో తరగతి విద్యార్థులు సంగేమ్ రాజు, మోరపోజు చైతన్య రిషి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో పార్నంది హర్షవర్ధన్ ఎంపికైనట్లు హెచ్ఎం తెలిపారు.
గట్కా పోటీలకు ఇద్దరు ఎంపిక
SGF రాష్ట్రస్థాయి గట్కా అండర్-17 విభాగంలో జాటోత్ అజయ్, సాత్విక్ ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో తమ ప్రతిభను నిరూపించుకుని రాష్ట్రస్థాయికి చేరుకోవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మేడ్చల్, హన్మకొండలో పోటీలు
ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అండర్-14 టెన్నిస్ పోటీలు హైదరాబాద్‌లోని GHMC ఇందిరా పార్క్‌లో జరగనున్నాయి. ఇదే తేదీల్లో గట్కా పోటీలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్వహించనున్నారు. అండర్-17 టెన్నిస్ పోటీలు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు హన్మకొండలోని JNS టెన్నిస్ కోర్టులో జరగనున్నాయి.
విద్యార్థులకు అభినందనలు
విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని హెచ్ఎం అమ్మ యాకయ్య తెలిపారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారికి శిక్షణ, ప్రోత్సాహం అందించిన ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్‌ను పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.