భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బొడ్డెమ్మ సంబరాల్లో మహిళలకు గిఫ్టులు.. బొమ్మెర బ్రదర్స్ ప్రత్యేక చొరవ

బొడ్డెమ్మ సంబరాల్లో మహిళలకు గిఫ్టులు.. బొమ్మెర బ్రదర్స్ ప్రత్యేక చొరవ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ చివరి రోజు సందర్భంగా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని గురుజు గడ్డ కాలనీలో మహిళలకు బొమ్మెర బ్రదర్స్ బహుమతులు అందజేశారు. శుక్రవారం నిర్వహించిన బొడ్డెమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలను ప్రోత్సహిస్తూ ఈ బహుమతులను పంపిణీ చేశారు.

తాతయ్య, నానమ్మ జ్ఞాపకార్థం బహుమతులు

స్వర్గీయ బొమ్మెర నారయ్య గౌడ్, యాకమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి మనుమలు బొమ్మెర రమేష్ గౌడ్, సతీష్ గౌడ్, సంతోష్ గౌడ్, సందీప్ గౌడ్ మహిళలకు బహుమతులు అందజేశారు. పండుగలో పాల్గొన్న మహిళలకు గిఫ్టులు పంపిణీ చేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.

పండుగల గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చాటాలి

ఈ సందర్భంగా బొమ్మెర బ్రదర్స్ సంయుక్తంగా మాట్లాడుతూ.. బొడ్డెమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళలు సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. మన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ సంప్రదాయాలను కొనసాగిస్తున్న మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే బహుమతులు అందించినట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు పండుగల పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తాయని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో చిరబోయిన ఐలమ్మ, వీరవోని ఉప్పమ్మ, బైరు అంజూర, ఆషాడపు కవిత, పోలోజు రమ, గుండ్ల మౌనిక, బొమ్మెర కలమ్మ, బొమ్మెర సోమక్క, చిరబోయిన కుమారు, మేడగోని శ్రీను గౌడ్, ఎలుగల బోయిన ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.