భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగను ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బాలికలు, యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను పూజిస్తూ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. శుక్రవారం చివరి రోజు వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి.
సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి
చివరి రోజు బొడ్డెమ్మ వద్ద మహిళలు సంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఏకరూప చీరలు ధరించి, లయబద్ధంగా కర్రలతో కొడుతూ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. పండుగ వాతావరణంలో బాలికలు, యువతులు, మహిళలు కలిసి ఆడిపాడడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మకు పూజలు
గత తొమ్మిది రోజులుగా గౌరీదేవి స్వరూపంగా భావించే బొడ్డెమ్మకు మహిళలు భక్తితో పూజలు నిర్వహించారు. తీరక్క పువ్వులతో అలంకరించి, వివిధ రకాల ప్రసాదాలను సమర్పిస్తూ అమ్మవారిని కొలిచారు. ప్రతిరోజూ సంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బొడ్డెమ్మ వేడుకలను కొనసాగించారు.
గంగమ్మ ఒడికి చేరిన బొడ్డెమ్మ
బొడ్డెమ్మ పండుగ చివరి రోజు మహిళలు సౌండ్ బాక్సుల సందడి మధ్య నృత్యాలు చేస్తూ బొడ్డెమ్మను ఊరేగింపుగా తరలించారు. “పోయిరా బొడ్డెమ్మ పోయిరావమ్మా.. చల్లగా త్వరగా తిరిగి రావమ్మా” అంటూ అమ్మవారిని వేడుకుంటూ చిన్ననాగారం చెరువుకు చేరుకున్నారు. అనంతరం బొడ్డెమ్మను చెరువులోని గంగమ్మ ఒడికి చేర్చి పండుగ ముగింపు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు సాగిన బొడ్డెమ్మ వేడుకలు గ్రామంలో భక్తి, ఆనందాన్ని నింపాయి. తరతరాలుగా వస్తున్న తెలంగాణ పండుగల సంప్రదాయాలను కొనసాగిస్తూ మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.