భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ ఇనుగుర్తి మండలం చిన్ననాగారం అంబేద్కర్ కాలనీలో ఘనంగా జరిగింది. తొమ్మిది రోజుల పాటు యువతులు, మహిళలు భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మను పూజిస్తూ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. చివరి రోజు శుక్రవారం నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పూల బొడ్డెమ్మతో మహిళల సందడి
బొడ్డెమ్మ పండుగ సందర్భంగా యువతులు, మహిళలు వివిధ రకాల పూలతో బొడ్డెమ్మను అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించి బొడ్డెమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ తొమ్మిది రోజుల పాటు సందడి చేశారు. కాలనీలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
గంగమ్మ ఒడికి బొడ్డెమ్మ
పండుగ చివరి రోజు శుక్రవారం మహిళలంతా బొడ్డెమ్మను సాక్షాత్తు గౌరీదేవిగా భావించి ప్రత్యేకంగా పూజించారు. అనంతరం బొడ్డెమ్మ పాటలు పాడుతూ, సంప్రదాయ పద్ధతిలో వేడుకలు నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంపై బొడ్డెమ్మను ఉంచి ఊరేగింపుగా గ్రామంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు.
“పోయిరా బొడ్డెమ్మ పోయిరావమ్మా” అంటూ పాటలు పాడుతూ బొడ్డెమ్మను చెరువులోని గంగమ్మ ఒడికి చేర్చారు. దీంతో అంబేద్కర్ కాలనీలో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన బొడ్డెమ్మ సంబరాలు సంప్రదాయబద్ధంగా ముగిశాయి.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాలనీవాసులు
బొడ్డెమ్మ వేడుకల్లో అంబేద్కర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగను మహిళలు ఐక్యంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.