భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మన ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని ABVP మెదక్ జిల్లా కన్వీనర్ బండారి ప్రశాంత్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయికృపా కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
పూలతో బతుకమ్మలు.. పాటలతో సందడి
కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్న విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా కార్యక్రమం సాగింది.
ప్రకృతితో అనుబంధానికి ప్రతీక
ఈ సందర్భంగా బండారి ప్రశాంత్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సంస్కృతి సంప్రదాయాలకు, ప్రకృతితో మనకున్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చడం, వాటి చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సంబరాలు చేసుకోవడం మన సంస్కృతిలో ప్రత్యేకత అని వివరించారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగను గౌరవిస్తూ, మన సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు బహుమతుల ప్రదానం
కార్యక్రమం అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల్లో ABVP నాయకులు నవీన్, సతీష్, సాత్విక్, సంతోష్, మహేష్, కళాశాల ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉబెద్, రవి, కరుణాకర్, స్వామి, దేవేందర్, ప్రశాంత్, నర్సింలు, దీపిక, స్వప్న మేడంతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.