భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఇనుగుర్తి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కదిరె ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా సుక్క ఉప్పలయ్యతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం
మండల కేంద్రం ఇనుగుర్తిలో శుక్రవారం నిర్వహించిన కమిటీ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాం నర్సయ్య, పరిశీలకుడిగా జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్ హాజరయ్యారు. వీరి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నూతన కమిటీ వివరాలను ఎన్నికల అధికారి వెంకట్రాం నర్సయ్య, పరిశీలకుడు సంగ శ్రీనివాస్ ప్రకటించారు.
మండల ఉపాధ్యక్షులుగా పి. సారంగపాణి, ఎండీ కౌసర్, కార్యదర్శులుగా టీ. రాజు, ఎం. సాగర్, ఏ. కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా జీ. వేణు, సభ్యులుగా ఎండీ మహమ్మద్, అకాడమిక్ సెల్ కన్వీనర్‌గా వి. దయాకర్, సభ్యుడిగా వి. సాయికుమార్ ఎంపికయ్యారు. జీవోల కమిటీ కన్వీనర్‌గా వి. శైలజ, సభ్యుడిగా వి. సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న టీపీటీఎఫ్ నాయకులకు, సభ్యులకు నూతన మండల అధ్యక్షుడు కదిరె ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సుక్క ఉప్పలయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులందరినీ కలుపుకొని వారి సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని ప్రకటించారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు కదిరె ప్రభాకర్ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకొని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పీఆర్సీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ప్రధాన కార్యదర్శి సుక్క ఉప్పలయ్య మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.