భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన తెలిపేందుకు బయలుదేరిన CPM జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వలిగొండలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతల అరెస్టును ఖండించారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు
ఈ సందర్భంగా CPM జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగ స్వామి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడం, పోలీసులతో దాడులు చేయించడం, దేశ రాజధాని ఢిల్లీకి రైళ్లు రాకుండా రద్దు చేయడం వంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కును కేంద్రంలోని మోడీ, అమిత్ షా ప్రభుత్వం కాలరాస్తోందని వారు ఫైరయ్యారు. ప్రజల గొంతును అణచివేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించకుండా నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న మోడీ, అమిత్ షాలకు ప్రజల నుంచి ఓటమి తప్పదని అన్నారు.
ఎన్నికల కమిషన్ నియామకం రాజ్యాంగబద్ధంగా జరగాలి
దేశంలో 13 కోట్ల మంది భారతీయుల ఓట్లను తొలగించారంటూ వారు ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, అందుకు బాధ్యుడిగా తాము పేర్కొంటున్న జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, శాంతియుత నిరసనలకు అవకాశం కల్పించాలని CPM నాయకులు డిమాండ్ చేశారు.
ఆందోళనలో పాల్గొన్న నాయకులు
ఈ నిరసన కార్యక్రమంలో CPM మండల కార్యదర్శివర్గ సభ్యుడు కూర శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు కల్కూరి రామచంద్రర్, కవిడే సురేష్, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, సహాయ కార్యదర్శి నానాచర్ల రమేష్, నాయకులు కొండూరు సత్తయ్య, శీలం ఇందిర, ధ్యానబోయిన యాదగిరి, పైళ్ల సత్తిరెడ్డి, ఆలకుంట్ల నరసింహ, వేముల లక్ష్మయ్య, గంగాపురం వెంకటేష్, కోరబోయిన మహేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.