భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నెల్లికుదురులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

నెల్లికుదురులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రారంభం కావడంతో నెల్లికుదురు మండలంలో పల్లెలన్నీ పూల సోయగాలతో కళకళలాడుతున్నాయి. తొమ్మిది రోజులపాటు యువతులు, మహిళలు భక్తిశ్రద్ధలతో ఆటపాటల మధ్య గౌరీదేవిని బతుకమ్మ రూపంలో కొలిచే ఈ పండుగలో భాగంగా శనివారం పితృ అమావాస్యను పురస్కరించుకొని మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు.

పల్లెల్లో పూల పండుగ సందడి

నెల్లికుదురులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు రావిరాల, మునిగలవీడు, వావిలాల, బ్రాహ్మణ కొత్తపల్లి, మదనతుర్తి, నరసింహుల గూడెం, రాజుల కొత్తపల్లి, ఆలేరు, పార్వతమ్మ గూడెం, రామన్నగూడెం, కాచికల్, ఎర్రబెల్లి గూడెం, బంజర, మేచరాజుపల్లి తదితర గ్రామాల్లో మహిళలు బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. తంగేడు తదితర రకాల పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చి, పైభాగంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాటలు, కోలాటాలతో సందడి

నెల్లికుదురులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

సాయంత్రం వేళ బతుకమ్మ పాటలు, డీజే పాటల సందడితో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు తమ వీధుల నుంచి బతుకమ్మలను సామూహికంగా తీసుకొని బయలుదేరి ఆలయ ప్రాంగణాలు, మైదానాలు, చెరువు గట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఉంచారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి లయబద్ధంగా సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలతో ఆడిపాడారు. యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని పండుగ శోభను మరింత పెంచారు.

భక్తిశ్రద్ధలతో బతుకమ్మల నిమజ్జనం

నెల్లికుదురులో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

ఆటపాటల అనంతరం మహిళలు బతుకమ్మలను సమీపంలోని చెరువులు, కాలువల వద్దకు సామూహికంగా తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. అనంతరం మొదటి రోజు సంప్రదాయం ప్రకారం ఇంటి నుంచి తీసుకొచ్చిన నువ్వులు, బియ్యప్పిండి, పుట్నాల పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. మహిళలు పరస్పరం వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు.

తెలంగాణ ఆడపడుచుల జీవన విధానం, ప్రకృతితో అనుబంధం, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ ప్రారంభంతో నెల్లికుదురు మండలంలోని గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.