భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆత్మగౌరవ బతుకమ్మ పండుగ ఇనుగుర్తి మండలంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. మండల కేంద్రం ఇనుగుర్తితో పాటు చిన్ననాగారం, కోమటిపల్లి, చిన్న ముప్పారం, అయ్యగారిపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో పితృ అమావాస్యను పురస్కరించుకొని ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు వైభవంగా నిర్వహించారు.
తీరొక్క పూలతో బతుకమ్మలు
మహిళలు తంగేడు తదితర రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. గోపురాకారంలో బతుకమ్మలను తీర్చిదిద్ది, పైభాగంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం వేళ గ్రామాల్లో బతుకమ్మ పాటలు, డీజే పాటలతో పండుగ సందడి నెలకొంది.
మహిళలు తమ వీధుల నుంచి బతుకమ్మలను సామూహికంగా తీసుకెళ్లి ఆలయ ప్రాంగణాలు, మైదానాలు, చెరువు గట్ల వద్ద ఉంచారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి లయబద్ధంగా సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు ఆడారు. ఆటపాటలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
భక్తిశ్రద్ధలతో బతుకమ్మల నిమజ్జనం
బతుకమ్మల వద్ద ఆటపాటలు ముగిసిన అనంతరం మహిళలు వాటిని సమీపంలోని చెరువులు, కాలువల వద్దకు సామూహికంగా తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. అనంతరం మొదటి రోజు సంప్రదాయం ప్రకారం నువ్వులు, బియ్యప్పిండి, పుట్నాల పప్పుతో తయారు చేసిన నైవేద్యాన్ని ఒకరికొకరు పంచుకున్నారు.
మహిళలు పరస్పరం వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయతను చాటుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగ ప్రారంభంతో ఇనుగుర్తి మండలంలోని గ్రామాల్లో సందడి నెలకొంది.