భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

విద్యార్థులు ఫాలోవర్లు కాదు.. లీడర్లుగా ఎదగాలి: కల్వకుంట్ల కవిత

విద్యార్థులు ఫాలోవర్లు కాదు.. లీడర్లుగా ఎదగాలి: కల్వకుంట్ల కవిత

భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బతుకమ్మ పండుగ.. మరోసారి బహుజన తెలంగాణ సాధనకు ఉద్యమ స్ఫూర్తిగా మారాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పేదింటి బిడ్డలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, యూనివర్సిటీలు కొత్త నాయకత్వాన్ని తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు.

తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ స్ఫూర్తి

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తనను భాగస్వామిని చేసిన విద్యార్థులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. ఓయూ పేరు వినగానే తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తుందని చెప్పారు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ఈ గడ్డ చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఉద్యమ సమయంలో బతుకమ్మను ముందుకు తీసుకెళ్లామని గుర్తుచేశారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పూలతో దేవుడిని పూజిస్తే, తెలంగాణలో పూలనే దేవతగా భావించి ఆరాధించే ప్రత్యేక సంస్కృతి ఉందని కవిత పేర్కొన్నారు. ప్రకృతిని పూజించే సంప్రదాయం ఎంత గొప్పదో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద జరుగుతున్న బతుకమ్మ వేడుకలను చూస్తే అర్థమవుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలకమైన స్ఫూర్తిగా నిలిచిందని వివరించారు.

బతుకమ్మలోనే సమానత్వ సందేశం

విద్యార్థులు ఫాలోవర్లు కాదు.. లీడర్లుగా ఎదగాలి: కల్వకుంట్ల కవిత

బతుకమ్మలో వివిధ రకాల పూలను కలిపి పేర్చినట్లే, భవిష్యత్తు తెలంగాణలోనూ అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండాలని కవిత ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ అంటే కేవలం ఆడిపాడటం మాత్రమే కాదని, దాని వెనుక సామాజిక ప్రయోజనం కూడా ఉండాలని అన్నారు. బతుకమ్మను పేర్చేందుకు మగపిల్లలు పూలు తీసుకొచ్చే సంప్రదాయం మన సంస్కృతిలో ఉందని, అదే స్ఫూర్తితో మహిళలకు అండగా నిలవాల్సిన బాధ్యత పురుషులందరిపై ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఉస్మానియా విద్యార్థుల మద్దతు, ఆశీర్వాదం అవసరమవుతాయని కవిత అన్నారు. తాను కూడా ఒక మహిళగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి విద్యార్థుల ఆశీర్వాదం కోరేందుకు వచ్చానని చెప్పారు. గతంలో బాలగంగాధర్ తిలక్ వినాయక చవితిని స్వాతంత్ర్య ఉద్యమంలో భాగం చేసిన తీరును గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మలో తెలంగాణ జెండాను భాగం చేశామని తెలిపారు.

తెలంగాణ సాధించిన తర్వాత సమానత్వం, స్వేచ్ఛతో పాటు అన్ని వర్గాలకు అధికారంలో ప్రాతినిధ్యం కల్పించాలంటే బతుకమ్మ మరోసారి ఉద్యమ స్వరూపాన్ని సంతరించుకోవాలని కవిత పిలుపునిచ్చారు.

ఓయూకు ప్రకటించిన నిధులు విడుదల చేయాలి

ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹.వెయ్యి కోట్లు ప్రకటించి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నిధులను సాధించేందుకు విద్యార్థులు, యూనివర్సిటీ వర్గాలు గట్టిగా డిమాండ్ చేయాలని అన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి నుంచి నిధులను ముక్కుపిండి అయినా రాబట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు.

విద్యార్థులు ఫాలోవర్లు కాదు.. లీడర్లుగా ఎదగాలి: కల్వకుంట్ల కవిత

ఇటీవల వినాయక చవితి సందర్భంగా లా కాలేజ్ విద్యార్థుల ఆహ్వానం మేరకు యూనివర్సిటీకి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించానని కవిత తెలిపారు. ఒక్కో గదిలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి ఉందని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని పేర్కొన్నారు. హార్వర్డ్ వంటి యూనివర్సిటీల కార్పస్ ఫండ్లు మన రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెబుతూ, తెలంగాణలోని యూనివర్సిటీల్లో మాత్రం కనీస సౌకర్యాల కొరత కనిపిస్తోందని విమర్శించారు.

యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని, 74 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కవిత పేర్కొన్నారు. అనేక యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యూనివర్సిటీల సమస్యలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. గతంలో బీఆర్ఎస్‌లో భాగస్వామిగా ఉన్నందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ వద్ద జరిగే ఆందోళనల గురించి చర్చ జరుగుతోందని, అదే తరహాలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కూడా విద్యార్థులు తమ సమస్యలపై ఉద్యమించాలని కవిత పిలుపునిచ్చారు. యూనివర్సిటీల సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఐక్యంగా ముందుకు రావాలని సూచించారు.

విద్యార్థులు ఫాలోవర్లు కాదు.. లీడర్లుగా ఎదగాలి: కల్వకుంట్ల కవిత

నాయకులను తయారు చేసే కేంద్రాలుగా యూనివర్సిటీలు

యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే విద్యాసంస్థలుగా కాకుండా నాయకులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని కవిత అన్నారు. పీవీ నరసింహారావు, జార్జ్ రెడ్డి, గద్దర్, కిషన్ జీ, స్వర్ణక్కతో పాటు వివిధ రాజకీయ భావజాలాలకు చెందిన పలువురు వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధం కలిగి ఉన్నారని గుర్తుచేశారు.

వెయ్యి మెదళ్లు మాట్లాడాలని, లక్షల ఆలోచనలు సంఘర్షించాలని, అప్పుడే సమాజంలో మార్పుకు దారి ఏర్పడుతుందని అన్నారు. ఓయూలో ఎంతోమంది యువత ఉన్నారని, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విద్యార్థి సంఘాల ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని కోరారు. విద్యార్థి సంఘాల ఎన్నికల ద్వారా యువతకు నాయకత్వ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా ఎదగాలంటే యూనివర్సిటీల్లో స్వేచ్ఛాయుత ఆలోచనలకు అవకాశం ఉండాలని కవిత అన్నారు. లేదంటే రాజకీయాల్లో కుటుంబాల వారసులకే ఎక్కువ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు కేవలం ఫాలోవర్లుగా ఉండకుండా లీడర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఎలక్షన్ కమిషనర్ మార్పు కాదు.. వ్యవస్థలో మార్పు కావాలి

విద్యార్థులు ఫాలోవర్లు కాదు.. లీడర్లుగా ఎదగాలి: కల్వకుంట్ల కవిత

ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తాను ఏకీభవించడం లేదని కవిత తెలిపారు. ఒక ఎలక్షన్ కమిషనర్‌ను మార్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని, మొత్తం ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కమిషనర్ స్థానంలో మరొకరిని నియమించినా పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs) స్థానంలో మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల విధానంపై విద్యార్థులు, యువత భయపడకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ధైర్యంగా ముందుకు రాకపోతే ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు.

రోహిత్ వేముల చట్టంపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన కవిత

రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని కవిత ప్రశ్నించారు. అశోక్ నగర్‌కు వచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీపై కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాలను నిలదీయాలని సూచించారు.

బహుజన తెలంగాణ సాధన, యూనివర్సిటీల అభివృద్ధి, విద్యార్థులకు సమాన అవకాశాలు, యువతలో నాయకత్వ లక్షణాల పెంపుదల వంటి అంశాలపై విద్యార్థులు చర్చించాలని కవిత పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగను సామాజిక మార్పుకు వేదికగా మార్చి, అన్ని వర్గాలకు సమాన హక్కులు, అధికారంలో భాగస్వామ్యం లభించే తెలంగాణ కోసం ముందుకు సాగాలని ఆమె కోరారు.