భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

నెల్లికుదురులో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

నెల్లికుదురులో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు పలు గ్రామాల్లో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గామాత నామస్మరణ, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

మండలంలోని కాచికల్లు, మునిగలవీడు, వావిలాల, నెల్లికుదురు, ఎర్రబెల్లిగూడెం తదితర గ్రామాల్లో జగజ్జనని దుర్గాదేవి నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నెల్లికుదురులో ప్రత్యేక పూజలు

మండల కేంద్రం నెల్లికుదురులోని చారిత్రక శ్రీ రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు పూజా క్రతువులు నిర్వహించారు. గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, అన్ని వర్గాలకు చెందిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

నవరాత్రి ఉత్సవాల ప్రారంభంతో ఆలయ పరిసరాల్లో భక్తి సందడి నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారి దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు దుర్గామాత బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోకపావని అయిన అమ్మవారి దివ్య సుందర రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి కృపాకటాక్షాలు తమ కుటుంబాలపై ఉండాలని ప్రార్థించారు.

మండలంలోని పలు గ్రామాల్లో నవరాత్రి వేడుకలు ప్రారంభం కావడంతో భక్తులు ఉత్సాహంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.