భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు రైతు వేదికలో సోమవారం ప్రజాప్రతినిధులు, రైతులు వీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిభ ఆహ్వానం మేరకు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావంపై అవగాహన
మునిగలవీడు సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, ఉపసర్పంచ్ కొమ్మనబోయిన మల్లయ్య, మదనతుర్తి సర్పంచ్ వడ్లకొండ రాధ యాకయ్య, BJP కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లాని పాపారావుతో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు వీడియో కాన్ఫరెన్స్‌ను ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఇతర అధికారులు ఎల్‌నినో ప్రభావం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై కూడా పడే అవకాశం ఉందని వివరించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడవచ్చని, సాగునీరు, తాగునీటి లభ్యతలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటిపై అధికంగా ఆధారపడే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని అధికారులు సూచించారు. నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి. వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిభ, నాయకులు దేవేందర్, రాజలింగం, దుస్స లింగయ్య, జనార్ధన్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాగా, మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు ఆలేరు రైతు వేదికలోనూ ఎల్‌నినోపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు వీక్షించారు.