భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామపంచాయతీ పరిధిలోని MSN కంపెనీకి గతంలో అనుమతులు మంజూరు చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గ్రామస్థులు మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కంపెనీకి అనుమతులు ఇచ్చిన సమయంలో నిబంధనలు పాటించారా? సంబంధిత గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్థుల అభిప్రాయాలు తీసుకున్నారా? అనే అంశాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.
12 బ్లాకులకు అనుమతులపై ఆరోపణలు
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ.. చందంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న MSN కంపెనీకి సంబంధించి గతంలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన పద్మ తన పదవీకాలంలో 12 బ్లాకులకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆరోపించారు. ఈ అనుమతుల గురించి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ప్రస్తుతం ఉన్న నూతన గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులకు తెలియజేయలేదని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలను తీసుకోకుండానే సొంత నిర్ణయంతో అనుమతులు ఇచ్చినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.
అనుమతుల రికార్డులను పరిశీలించాలి
కంపెనీకి అనుమతులు మంజూరు చేసే సమయంలో నిబంధనలు పాటించారా లేదా అనే విషయాన్ని సంబంధిత అధికారులు అధికారికంగా పరిశీలించాలని గ్రామస్థులు కోరారు. అనుమతులకు సంబంధించిన రికార్డులు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన పద్మ వ్యవహారంపై చట్టప్రకారం సమగ్ర విచారణ జరిపించాలని, విచారణలో బాధ్యతారాహిత్యం లేదా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి చందంపేట గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని ఫిర్యాదుదారులు విజ్ఞప్తి చేశారు. అనుమతుల మంజూరుకు సంబంధించిన అన్ని అంశాలను పారదర్శకంగా పరిశీలించి, గ్రామస్థుల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాటికొండ రామకృష్ణ, శేరి స్వామి, గరిగె నర్సింలు, డోలి నరేష్, గాజుల లావణ్య, నవీన్, భూంగారి మౌనిక, గణేష్ గౌడ్, నాయకులు శేరి చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.