భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

జీవనభృతి కోసం బీడీ కార్మికుల ధర్నా

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ నెలకు ₹.4,016 జీవనభృతిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా నార్సింగిలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను తహసీల్దార్ గ్రేస్‌బాయికి అందజేశారు.

100 రోజుల్లో అమలు చేస్తామని హామీ

ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీడీ కార్మికులకు విధించిన కటాఫ్ తేదీని తొలగించి, అర్హులైన కార్మికులందరికీ జీవనభృతి అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం నెలకు ₹.2,016 జీవనభృతి పొందుతున్న వారికి మరో ₹.2,000 పెంచి మొత్తం ₹.4,016 అందిస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..

అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా హామీని అమలు చేయకపోవడంతో బీడీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. బీడీలు చుట్టడమే జీవనాధారంగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం జీవనభృతిని పెంచి, అర్హతల పేరుతో కార్మికులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కటాఫ్ తేదీ పేరుతో అన్యాయం చేయొద్దు

కటాఫ్ తేదీని సాకుగా చూపి బీడీ కార్మికులను జీవనభృతికి దూరం చేయడం సరికాదని పిట్ల రామకృష్ణ అన్నారు. ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా ప్రతి బీడీ కార్మికుడికి నెలకు ₹.4,016 చొప్పున జీవనభృతి అందించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే గతంలో కేసీఆర్‌కు ఎదురైన రాజకీయ పరిస్థితులే సీఎం రేవంత్‌రెడ్డికి ఎదురవుతాయని హెచ్చరించారు.

బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..

యూనియన్ రాష్ట్ర నాయకులు ఆర్. రమేష్, సత్తమ్మ మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు, వివక్ష లేకుండా జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులకు ప్రభుత్వ ఆర్థిక సాయం ఎంతో అవసరమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా జాప్యం చేయడం సరైంది కాదన్నారు.

హామీ అమలు చేసే వరకు పోరాటం

ప్రభుత్వం తక్షణమే స్పందించి బీడీ కార్మికులకు నెలకు ₹.4,016 జీవనభృతిని అమలు చేయాలని యూనియన్ నాయకులు కోరారు. సమస్యను పరిష్కరించకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీడీ కార్మికుల హక్కుల సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.