భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు గాంధీ పార్క్తో పాటు స్థానిక వీరభవన్లోని సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి. విజయ సారధి రెడ్డి, 33వ వార్డు కౌన్సిలర్ బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ పార్క్లో ఐదవ రోజు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆధ్వర్యంలో వీరభవన్లోని సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద కూడా బతుకమ్మ వేడుకలు జరగనున్నాయని చెప్పారు.
ఈ రెండు కార్యక్రమాల్లో మహిళలు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని వారు కోరారు. మన పూర్వీకుల నుంచి అందిన ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు అని, ఇలాంటి వేడుకల్లో అందరూ భాగస్వాములై సంప్రదాయాలను కాపాడుకోవాలని సీపీఐ నేతలు పిలుపునిచ్చారు.