భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎరువుల దుకాణాల్లో రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్. విజయచంద్ర డీలర్లు, యజమానులకు సూచించారు. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, రైతులకు కొనుగోలు చేసిన ఎరువులకు సంబంధించిన బిల్లులు అందించాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు చిన్ననాగారం, చిన్నముప్పారం గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర, మండల వ్యవసాయాధికారి షేక్ యాస్మిన్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఎరువుల కొనుగోలుకు వచ్చే రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ వివరాలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనుమతి లేని గడ్డి మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
అనంతరం చిన్నముప్పారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా వ్యవసాయాధికారి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
రాబోయే వానాకాలం పంటల కొనుగోలు ప్రక్రియ కూడా రైతు గుర్తింపు కార్డు ఆధారంగా జరిగే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల రైతులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలపై దృష్టి
ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం దృష్ట్యా ఈ యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని విజయచంద్ర రైతులకు సూచించారు. నీటి లభ్యతపై ఆధారపడే పంటలను సాగు చేస్తే వర్షాలు సరిగా కురవని పరిస్థితుల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పంటల సాగులో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ సూచనలు, సలహాలను పాటించాలని కోరారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా సాగులో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు వి. భాస్కర్, చందూలాల్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.