భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ.. ఇనుగుర్తిలో కన్నీటి వీడ్కోలు

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ.. ఇనుగుర్తిలో కన్నీటి వీడ్కోలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తండ్రి అంత్యక్రియలను పెద్ద కుమార్తె నిర్వహించిన హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రి అనారోగ్యంతో కన్నుమూయడంతో ముగ్గురు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. వారిలో పెద్ద కుమార్తె ఉష తండ్రికి తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఈ దృశ్యం అక్కడున్న గ్రామస్తులను కంటతడి పెట్టించింది.

అనారోగ్యంతో తండ్రి మృతి

ఇనుగుర్తికి చెందిన బండారి రాములు (46) అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. తనకు ముగ్గురు కుమార్తెలు ఉష, దివ్య, దీపిక ఉన్నారు. కుమారుడు లేకపోయినా తన కూతుళ్లనే కొడుకులుగా భావించి ప్రేమగా పెంచుకున్న రాములు అకాల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

తండ్రి చివరి ప్రయాణంలో ముందుండి..

తమను కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక కుమార్తెలు ఉష, దివ్య, దీపిక వెక్కివెక్కి ఏడ్చారు. బుధవారం నిర్వహించిన తండ్రి అంతిమయాత్రలో ముగ్గురూ ముందుండి నడిచారు. పెద్ద కుమార్తె ఉష తండ్రికి తలకొరివి పెట్టి చితికి నిప్పంటించింది. తండ్రి పట్ల తనకున్న ప్రేమను, బాధ్యతను చాటిన ఈ ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

గ్రామస్తుల కంటతడి

తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమార్తెల దుఃఖాన్ని చూసి గ్రామస్తులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబానికి అండగా నిలిచిన రాములు మృతి ఆ కుటుంబానికి తీరని లోటుగా మారింది. తండ్రికి పెద్ద కుమార్తె అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ఇనుగుర్తిలో విషాదాన్ని నింపింది.