భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహబూబాబాద్ పట్టణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. పండుగలో భాగంగా ఐదో రోజు పట్టణంలోని నాలుగో వార్డు గాంధీపురంతో పాటు 17వ వార్డులోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు.

మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలు

ఈ వేడుకల్లో మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ పండుగ సంబరాల్లో సందడి చేశారు. మహిళల ఉత్సాహం, సంప్రదాయ పాటలు, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా జ్యోతి రమేష్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అందమైన బతుకమ్మలకు బహుమతులు

22వ వార్డు కౌన్సిలర్ పద్మ ధనలక్ష్మి ప్రవీణ్ వేడుకల్లో పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. అందంగా బతుకమ్మలను అలంకరించిన మహిళలను అభినందిస్తూ బహుమతులు అందజేశారు. పండుగలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహించడం వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహబూబాబాద్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని జ్యోతి రమేష్ నాయక్ ఆకాంక్షించారు.

పలువురి హాజరు

ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ చైర్మన్ పమ్మి సనాతన చారి, అనురాధ దంపతులు, 17వ వార్డు దుర్గమ్మ కమిటీ ఉత్సవ సభ్యులు, 22వ వార్డు కౌన్సిలర్ పద్మ ధనలక్ష్మి ప్రవీణ్, 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులు, ఇతర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.