భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామీణ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో అడుగు పడింది. వలిగొండ మండలం నర్సాపురం గ్రామపంచాయతీ పరిధిలోని పిసరివారిగూడెంలో మత్స్యగిరి బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటుకు గురువారం భూమిపూజ నిర్వహించారు. అతిరద్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు.
రైతులకు ప్రయోజనం.. యువతకు ఉపాధి
ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటవడం వల్ల స్థానికంగా అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ, ఏపీలో 50 కంపెనీల లక్ష్యం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో 25 బయోగ్యాస్ కంపెనీలను ఏర్పాటు చేయాలని తమ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. ఈ ప్రణాళికలో భాగంగా తొలి కంపెనీని మత్స్యగిరి పుణ్యక్షేత్ర పరిధిలో ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఈ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు కావడం స్థానికంగా ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ భూమిపూజ కార్యక్రమంలో భూమి యజమాని పిసరి వెంకటరెడ్డి, సాయికుమార్, కేశవ, నర్సాపురం సర్పంచి కావటి మంజుల ఉప్పలయ్య, సామ సరస్వతి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.