భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దివ్యాంగులు తమ రోజువారీ పనులను మరింత సులభంగా చేసుకుంటూ, ఇతరులపై ఆధారపడకుండా స్వావలంబనతో ముందుకు సాగాలనే లక్ష్యంతో సహాయ పరికరాలను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని లబ్ధిదారులకు పరికరాలను అందజేశారు.
202 మంది లబ్ధిదారులకు పరికరాలు
ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 202 మంది లబ్ధిదారులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఇందులో 38 ట్రై సైకిళ్లు, 73 TLM పరికరాలు, 22 వీల్చైర్లు అందజేశారు. వీటితో పాటు ఇతర విభాగాలకు చెందిన 367 సహాయ పరికరాలను కూడా పంపిణీ చేశారు.
దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల రోజువారీ పనులు చేసుకోవడం సులభమవుతుందని, వారి ఆత్మవిశ్వాసం పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దివ్యాంగులు తమకు అందిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా DWO హేమ భార్గవి, కౌన్సిలర్లు పబ్బ సత్యనారాయణ గుప్తా, శంకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, నవత్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే మేకల లావణ్య, కార్తిక్, దామోదర్ రావు, అక్కన్నపేట సర్పంచ్ బక్కన్నగారి యాదగిరి, బండి గిరి తదితరులు హాజరయ్యారు.