భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సంబరాల్లో గౌడ సంఘ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.
సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి
ఈ వేడుకలకు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, తంగేడు, గునుగు, చామంతి, బంతి వంటి రంగురంగుల ప్రకృతి సిద్ధమైన పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చారు.
అనంతరం బతుకమ్మలను మధ్యలో ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ సంప్రదాయ జానపద గీతాలు ఆలపించారు. చప్పట్లు కొడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో ఫంక్షన్ హాల్ పరిసరాలు సందడిగా మారాయి.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కొనియాడారు. పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో పండుగను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు మహిళల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, కిల్ల గంగాధర్ గౌడ్, నర్సా గౌడ్, కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో కులబాంధవులు, మహిళలు పాల్గొన్నారు.