భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాల అమలును పరిశీలించేందుకు మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ వివిధ హోటళ్లు, రెస్టారెంట్లను సందర్శించి అక్కడి పరిసరాలను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందుతున్నదా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.
అపరిశుభ్రతపై జరిమానా
తనిఖీల్లో భాగంగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు, అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించిన సిటీ ప్యాలెస్ హోటల్ యాజమాన్యానికి అధికారులు ₹.2,000 జరిమానా విధించారు. హోటళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిబంధనలు పాటించాలి
హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. పట్టణ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ మురళీమోహన్, వార్డు అధికారులు ఉదయ్ కుమార్, ప్రవీణ్, నాగేంద్రబాబు, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.