భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

చిన్న వయసులోనే కన్నుమూసిన అభిషేక్.. గ్రామంలో విషాదం

చిన్న వయసులోనే కన్నుమూసిన అభిషేక్.. గ్రామంలో విషాదం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అందరితో కలివిడిగా ఉంటూ గ్రామస్తులకు సుపరిచితుడైన 22 ఏళ్ల అభిషేక్ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మలిశెట్టి నగేష్, సుధ దంపతుల కుమారుడైన అభిషేక్ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడి మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తల్లిదండ్రులకు తీరని శోకం

అభిషేక్ మూగవాడు కావడంతో ప్రాథమిక విద్య అనంతరం ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు అతడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే అభిషేక్ ఉన్నట్టుండి మృతి చెందడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. అతడి మరణానికి గుండెపోటు కారణమై ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నప్పటికీ, మరణానికి గల కారణం నిర్ధారణ కాలేదు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చడం అక్కడికి వచ్చిన వారికీ కష్టంగా మారింది.

అభిషేక్‌కు హుస్సేన్ నాయక్ నివాళి

అభిషేక్ మృతి విషయం తెలుసుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అయ్యగారిపల్లికి చేరుకుని అభిషేక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న వయసులోనే అభిషేక్ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

పాడె మోసిన సర్పంచ్ శోభన్

స్థానిక సర్పంచ్ మలిశెట్టి శోభన్ కూడా అభిషేక్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. చిన్నప్పటి నుంచి మాటలు రాకపోయినా అందరితో కలివిడిగా ఉండే అభిషేక్ ఇంత త్వరగా మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అనంతరం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించిన మహాప్రస్థాన యాత్రలో పాల్గొని పాడె మోశారు.

ఈ కార్యక్రమంలో కొణతం వెంకన్న, మామిడి శోభన్, మలిశెట్టి శ్యామ్, సూర్య, బొల్లు సంపత్‌తోపాటు వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొని అభిషేక్‌కు నివాళులర్పించారు. యువకుడి మృతితో అయ్యగారిపల్లిలో విషాద వాతావరణం నెలకొంది.