భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు నెల్లికుదురు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో సింగారపు కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
పూలతో బతుకమ్మల అలంకరణ
ఈ వేడుకలకు స్థానిక తహసీల్దార్ చందా నరేష్, ఏపీఎం నరేంద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ నరసింగరావు హాజరయ్యారు. ఎంపీడీవో కార్యాలయం, సెర్ఫ్ (ఐకేపీ), ఉపాధి సిబ్బంది వివిధ రకాల పూలను సేకరించి రంగురంగుల బతుకమ్మలను పేర్చారు. అనంతరం సౌండ్ బాక్సుల్లో వినిపించిన బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడి పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలతో కార్యాలయ ఆవరణ సందడిగా మారింది.
ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే పండుగ
ఈ సందర్భంగా తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. ప్రకృతిని, స్త్రీ శక్తిని, జీవన విధానాన్ని ఆరాధించే ప్రత్యేకమైన పూల పండుగగా బతుకమ్మకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, సెర్ఫ్ (ఐకేపీ), ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.