భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

పంటనష్టంపై సర్వే చేయాలి.. రైతులకు పరిహారమివ్వాలి

పంటనష్టంపై సర్వే చేయాలి.. రైతులకు పరిహారమివ్వాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ నియోజకవర్గంలో కరువు పరిస్థితులతో ఎండిపోతున్న వరి పంటలను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బట్టి అజయ్‌ శనివారం పరిశీలించారు. మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి, శివాయపల్లి గ్రామాల్లో పర్యటించి, ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. రైతులను కలిసి పంటల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగేలా వారి సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు?

పంటనష్టంపై సర్వే చేయాలి.. రైతులకు పరిహారమివ్వాలి

ఈ సందర్భంగా బట్టి అజయ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంపై విమర్శలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పది నెలల ముందే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయకుండా, వచ్చే యాసంగిలో వరి పంట వేయొద్దని, రైతులు త్యాగం చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కరువు ముప్పు గురించి ముందే తెలిసినప్పుడు రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కరెంటు కోతలతో పంటలకు నష్టం

పంటనష్టంపై సర్వే చేయాలి.. రైతులకు పరిహారమివ్వాలి

మెదక్ నియోజకవర్గంలో పంటలు చేతికొచ్చే దశలో నీరు అందక ఎండిపోతున్నాయని బట్టి అజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బోరు మోటార్లపై ఆధారపడి పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నప్పటికీ, విద్యుత్ కోతల కారణంగా సాగునీరు అందించలేకపోతున్నారని తెలిపారు. పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు దెబ్బతినడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం వెంటనే గుర్తించి, పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే స్పందించాలి

పంటనష్టంపై సర్వే చేయాలి.. రైతులకు పరిహారమివ్వాలి

నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేదని బట్టి అజయ్‌ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. వ్యవసాయం, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు

పంటనష్టంపై సర్వే చేయాలి.. రైతులకు పరిహారమివ్వాలి

మెదక్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బట్టి అజయ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే రెవెన్యూ, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించాలని కోరారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించి, అర్హమైన ప్రాంతాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాలని సూచించారు.

వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పంట నష్టం సర్వే నిర్వహించి, అధికారిక నివేదికను జిల్లా కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు తగిన పరిహారం అందించాలని కోరారు. మిగిలి ఉన్న పంటలనైనా కాపాడుకునేందుకు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో గుట్టకిందిపల్లి గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్‌, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌, భూపత్పూర్ గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రేమ్‌, రమేష్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుట్టకిందిపల్లి, శివాయపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.