భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ చిన్న నాగారం గ్రామానికి చెందిన BRS యువకులు శనివారం రాత్రి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న యువకులు కరెంట్ కోతలను నిరసిస్తూ నినాదాలు చేశారు.
కరెంట్ కోతలతో ఇబ్బందులు
సాయంత్రం, రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఈ సందర్భంగా యువ నాయకులు తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సమయంలో బంధువులు, చిన్నపిల్లలతో గ్రామంలో సందడి నెలకొన్న వేళ కరెంట్ కోతలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు.
విద్యుత్ లేకపోవడంతో ఉక్కపోత, దోమల సమస్యలను భరించలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా “కాంగ్రెస్ పోవాలి.. కరెంట్ రావాలి” అంటూ నినాదాలు చేశారు.
ఈ ధర్నాలో యువ నాయకులు వడపల్లి సందీప్ గౌడ్, బైరు వినయ్ గౌడ్, బత్తిని మురళీకృష్ణ (చింటు), కొయ్యడి సాయిరాంతో పాటు పలువురు పాల్గొన్నారు.