భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

సర్పంచి యాకాంతం గౌడ్ ఇంట్లో భారీ బతుకమ్మ

సర్పంచి యాకాంతం గౌడ్ ఇంట్లో భారీ బతుకమ్మ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచి డా. చిర్ర యాకాంతం గౌడ్ తన నివాసంలో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూలను అందంగా పేర్చి రంగుల గోపురాన్ని తలపించేలా తీర్చిదిద్దిన ఈ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గౌరీమాతతో మరింత శోభ

బతుకమ్మ పైభాగంలో గౌరీమాతను ఏర్పాటు చేయడంతో పాటు, సర్పంచి పేరుతో ప్రత్యేక రింగ్‌ను అమర్చారు. దీంతో పూలతో అలంకరించిన బతుకమ్మ మరింత అందంగా కనిపించింది. సంప్రదాయబద్ధంగా రూపొందించిన భారీ బతుకమ్మను చూసి డా. యాకాంతం గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలికలు, యువతులు, మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

భావితరాలకు సంప్రదాయాలను అందించాలి

మన పండుగల వెనుక ఉన్న విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డా. యాకాంతం గౌడ్ తెలిపారు. విద్యావేత్తగా, సమాజ సేవకుడిగా, శ్రీ వివేకవర్ధిని విద్యాసంస్థల చైర్మన్‌గా, లయన్స్ క్లబ్ గవర్నర్‌గా, యోగ ఉపాసకుడిగా, ప్రజా సంఘాల నాయకుడిగా ఆయన వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు.

ప్రతి పండుగను పవిత్రమైన వేడుకగా భావిస్తూ సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించడం ద్వారా సమాజంలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను వాటి సంప్రదాయాలకు అనుగుణంగా విద్యాసంస్థల్లో నిర్వహిస్తూ, వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

యోగ, ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు మెరుగ్గా కృషి చేయగలమని డా. యాకాంతం గౌడ్ వివరిస్తుంటారు. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగల వెనుక ఉన్న ప్రత్యేకతలను భావితరాలకు అందించడంలో ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుందని ఆయన తెలిపారు. సంప్రదాయాలను కాపాడుకుంటూ వాటి విలువలను యువతకు తెలియజేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.