భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

నెల్లికుదురు మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

నెల్లికుదురు మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం ఘనంగా జరిగాయి. పూల పండుగను పురస్కరించుకుని మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పూలతో అందంగా బతుకమ్మల అలంకరణ

తీరొక్క పూలతో గోపురాల తరహాలో బతుకమ్మలను పేర్చిన మహిళలు.. వాటి శిఖరంపై గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని భక్తితో కొలిచారు. అనంతరం సాయంత్రం వేళ బతుకమ్మలను సామూహికంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల ఆవరణలు, బతుకమ్మ సెంటర్లకు తీసుకువచ్చారు.

ఆటపాటలతో పండుగ సందడి

బతుకమ్మ పాటలు, డీజేలు, సౌండ్ బాక్సుల మోతతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి లయబద్ధంగా అడుగులు వేస్తూ పాటలు పాడారు. సంప్రదాయ ఆటపాటలతో వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళల సందడి, రంగురంగుల బతుకమ్మలతో పల్లెలు కళకళలాడాయి.

నెల్లికుదురు మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

గంగమ్మ ఒడికి బతుకమ్మలు

వేడుకల్లో భాగంగా మహిళలు బతుకమ్మలను ఆయా గ్రామాల్లోని చెరువులు, కాలువల వద్దకు తీసుకెళ్లారు. “పోయిరా బతుకమ్మ.. పోయిరావమ్మా” అంటూ పాటలు పాడుతూ గంగమ్మ ఒడికి బతుకమ్మలను సాగనంపారు. ఈ సందర్భంగా మహిళలు తమ వెంట తెచ్చుకున్న వివిధ రకాల ప్రసాదాలు, వాయనాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

సర్పంచుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు

మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సజావుగా జరిగేలా సర్పంచులు, పాలకమండళ్లు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ సెంటర్లతో పాటు బతుకమ్మలను చెరువులు, కాలువల వద్దకు తీసుకెళ్లే మార్గాల్లోనూ విద్యుత్ బల్బులను ఏర్పాటు చేశారు. దీంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకల్లో పాల్గొన్నారు.

మండలంలోని నరసింహులగూడెంలో సర్పంచ్ గోగుల జ్యోతి రామకృష్ణ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.