భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో సోమవారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కార్పొరేట్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాలకు చెందిన 224 మంది మహిళలకు ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందులో నెల్లికుదురు మండలానికి 154, ఇనుగుర్తి మండలానికి 70 కుట్టు మిషన్లు కేటాయించారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వివిధ సంస్థల సహకారంతో ఇప్పటికే ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు, రైతులకు స్ప్రే పంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు వివరించారు. సమాజంలోని వివిధ వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు కుటీర పరిశ్రమలకు సంబంధించిన యంత్రాలను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. కుట్టు మిషన్లను వినియోగించుకొని మహిళలు ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సేవలను గుర్తించి సిఫారసు చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించారని హుస్సేన్ నాయక్ తెలిపారు. ఈ పదవి ద్వారా దేశవ్యాప్తంగా గిరిజనుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభించిందన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఒద్దిరాజు రామచంద్రరావు, ఎడ్ల అశోక్ రెడ్డి, మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నల్లాని పాపారావు, గుగులోతు నవీన్ నాయక్, బాదావత్ సురేష్, రాస యాకిరెడ్డి, బీరవెల్లి యాదగిరిరెడ్డి, పర్నె ప్రభాకర్ రెడ్డి, తోట రమేష్, సురేష్తో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని పలువురు ఆకాంక్షించారు.