భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో విజయదశమి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ప్రజలు దసరా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామాల్లో ఉత్సవాల నిర్వహణకు సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకమండళ్లు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలు సామూహికంగా తరలివెళ్లి పాలపిట్టను దర్శించుకున్నారు. ఆయా గ్రామాల్లోని బొడ్రాయిల వద్ద సనాతన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
దసరా సందర్భంగా గ్రామాల్లో వేదమంత్రోచ్ఛారణల నడుమ షమీ పూజలు నిర్వహించారు. అనంతరం యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ ఆచారాల్లో భాగంగా సొర, ఆనిగ కాయలను నరికే కార్యక్రమాలతో పాటు కొన్ని గ్రామాల్లో జంతుబలులు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగిన ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
మండల కేంద్రం నెల్లికుదురులోని స్థానిక విద్యాసంస్థల సముదాయ ఆవరణలో రావణ వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రావణ వధను తిలకించేందుకు నెల్లికుదురు పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యువకుల కేరింతలు, ప్రజల ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్నతో పాటు గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దసరా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా నెల్లికుదురు ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. విజయదశమి పురస్కరించుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పూజల్లో పాల్గొని సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. మండలవ్యాప్తంగా దసరా వేడుకలు ఉత్సాహంగా, ప్రశాంతంగా ముగిశాయి.