భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్‌కు అభినందనల వెల్లువ

టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్‌కు అభినందనల వెల్లువ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అభ్యర్థిగా డా. నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకులు మహమ్మద్ మోను, మహమ్మద్ ఆసిఫ్, షేక్ సువనక్కర్, షేక్ రజాక్ తదితరులు శ్రీకాంత్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి, అభ్యర్థిత్వం ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు.

ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన డా. శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉద్యమ సమయంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన ఆయనకు విద్యారంగం, నిరుద్యోగం, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ వివిధ సంఘాల నాయకులు, విద్యావంతులు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు.

విజయదశమి సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ తన స్వగ్రామమైన చిన్ననాగారానికి రావడంతో విషయం తెలుసుకున్న ఇనుగుర్తి మండలానికి చెందిన పలువురు పట్టభద్రులు మంగళవారం సాయంత్రం ఆయనను కలిశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు తినిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలుస్తామని పలువురు తెలిపారు.

కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాంత్ గౌడ్: తన ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమను గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తున్న నాయకులు, పట్టభద్రులు, వివిధ సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని పేర్కొంటూ, పట్టభద్రులు తనకు మద్దతు తెలిపి విజయానికి సహకరించాలని శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.