భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

క్లాస్‌మేట్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక చేయూత

క్లాస్‌మేట్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక చేయూత

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన యువకులు. తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలు బండారి దివ్య తండ్రిని కోల్పోయి విషాదంలో ఉన్న విషయం తెలుసుకున్న క్లాస్‌మేట్స్‌ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కష్టకాలంలో స్నేహితురాలికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి తమ వంతు సాయం చేయడం పలువురిని ఆకట్టుకుంది.

ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన బండారి రాములు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన కుమార్తె దివ్యతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న దివ్య సహచర క్లాస్‌మేట్స్‌ బుధవారం ఆమె ఇంటికి చేరుకున్నారు. ముందుగా స్వర్గీయ బండారి రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అనంతరం స్నేహితురాలు దివ్యను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న దివ్యకు మనోధైర్యం కల్పిస్తూ, కష్టసమయంలో అధైర్యపడవద్దని సూచించారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా స్నేహితులంతా కలిసి రూ.8,000 నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితురాలికి తమ వంతు సాయం చేయడం ద్వారా స్నేహబంధంలోని ఆప్యాయతను చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప బైక్ జోన్ ప్రొప్రైటర్ సుంకనపల్లి రాకేష్‌తో పాటు గండు రాము, మెట్టు రాకేష్, గడ్డం రాకేష్, కొడారి మురళి, కొత్తూరు పవన్, కేసరి నవీన్, కమటం మహేష్ పాల్గొన్నారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడమే నిజమైన స్నేహానికి నిదర్శనమని వారి సహకారం చాటిచెప్పింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు మనోధైర్యం కల్పించిన క్లాస్‌మేట్స్‌ సేవాభావాన్ని పలువురు అభినందించారు.