భారత్ సమాచార్, మెదక్ : రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గాజవాడ లావణ్య అధికారులకు సూచించారు. ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఏడో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా మాట్లాడుతూ, ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇళ్లు మంజూరైన వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అధికారులు, ఆర్పీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించాలని నాగరాజు గుప్తా తెలిపారు. నిర్మాణాల సమయంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని, బిల్లులు సకాలంలో అందితే నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తవుతాయని పేర్కొన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించి, పథకం లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజవాడ లావణ్య, వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత, తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ కే. రవీందర్, చౌదరి చరిత, మద్దెల మాధవి రమేష్, దే మే యాదగిరి, డాకి శ్యామల స్వామి, పుట్టి సందీప్, కొక్కు ప్రవీణ్, దేవుని రంజిత్, ఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.