భారత్ సమాచార్, మెదక్ : ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి దర్శనానికి వచ్చి తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని మెదక్ జిల్లా పోలీసుల క్యూ.ఆర్.టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్) సిబ్బంది సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి చిన్నారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల అప్రమత్తతపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.
బాన్సువాడకు చెందిన మోహన్, సంధ్య దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్‌తో కలిసి శుక్రవారం ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ మధ్య బాలుడు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో ఆలయ ప్రాంగణంలో బాలుడు ఒంటరిగా ఏడుస్తూ కనిపించడంతో అక్కడ విధుల్లో ఉన్న మెదక్ జిల్లా క్యూ.ఆర్.టీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.
బాలుడిని చేరదీసిన పోలీసులు అతడికి భరోసా కల్పించి, వివరాల ఆధారంగా తల్లిదండ్రులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులను గుర్తించి, మోక్షిత్‌ను సురక్షితంగా వారి వద్దకు చేర్చారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో మోహన్, సంధ్య దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి తమ బిడ్డను తిరిగి అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రద్దీగా ఉండే ఆలయాలు, జాతరలు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలిపెట్టవద్దని, వారి చేయి పట్టుకుని దగ్గరగా ఉంచుకోవాలని తెలిపారు. చిన్నారులు తప్పిపోయిన సందర్భంలో వెంటనే అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమయస్ఫూర్తితో స్పందించి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన క్యూ.ఆర్.టీ సిబ్బందిని అభినందించారు.