భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి..

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి..

భారత్ సమాచార్, నిజామాబాద్ : దేశంలో కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆర్థిక రిజర్వేషన్ల అవగాహన రథయాత్ర నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆర్థిక్, ఆధార్, ఆరక్షన్ ఆందోళన్ సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ అరోరా ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రథయాత్రను నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అక్టోబర్ 2న ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్ర వివిధ ప్రాంతాల మీదుగా తెలంగాణకు చేరుకుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ హాల్‌లో సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

రిజర్వేషన్లను కుల ప్రాతిపదికన కాకుండా వ్యక్తుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అమలు చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలంటే తగిన విధానాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కుల వివక్షకు స్వస్తి పలికి, ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ ఉద్యమంలో యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సమాన అవకాశాలు, సామాజిక ఐక్యత, దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక్, ఆధార్, ఆరక్షన్ ఆందోళన్ తెలంగాణ కోఆర్డినేటర్ కర్ణాకర్ రెడ్డి, జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.