భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మున్సిపల్ కార్మికులకు ₹.30 వేల వేతనం ఇవ్వాలి

నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం*

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. రెండో పీఆర్సీని ప్రకటించడంతో పాటు కనీస వేతనాన్ని ₹.30వేలుగా నిర్ణయించాలని కోరింది. ఈ మేరకు నర్సాపూర్ మున్సిపల్ మేనేజర్‌కు యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా మున్సిపల్ కార్మికులకు రెండో పీఆర్సీ పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని ప్రకటించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనంగా ₹.30వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికులకు సరైన హెల్త్, సేఫ్టీ సౌకర్యాలు అందడం లేదని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రమాదాల బారిన పడుతున్న కార్మికులకు తగిన భద్రత కల్పించాలని, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. పట్టాదారులకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మందికి పైగా మున్సిపల్ కార్మికులు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రతతో పాటు అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు కూడా అందడం లేదని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని నాగరాజు గుర్తుచేశారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అక్టోబర్ 26న చలో హైదరాబాద్

మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26న (అక్టోబర్ 26, 2026) చలో హైదరాబాద్ కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్త పోరాటానికి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని నాగరాజు తెలిపారు. ఈ పోరాటంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని మున్సిపల్ మేనేజర్‌ను కోరినట్లు చెప్పారు.

కార్మికుల వేతనాలు, పీఆర్సీ, ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పుష్ప, రాములు, అనిత, అశోక్‌తో పాటు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.