భారత్ సమాచార్, టెక్నాలజీ : స్మార్ట్‌ఫోన్ తయారీలో ఉపయోగించే మెమొరీ చిప్‌ల ధరలు పెరగడం, పరికరాల తయారీ వ్యయాలు అధికం కావడం అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీలు ఫోన్ల ధరలను పెంచుతుండగా, వినియోగదారులు కొత్త ఫోన్ కొనుగోలును వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా రూ.20 వేలలోపు ధర కలిగిన ఫోన్ల షిప్‌మెంట్లు ఏకంగా 47% తగ్గడం గమనార్హం. పండగల సీజన్‌లోనూ డిమాండ్ బలహీనంగా ఉండటంతో తయారీ సంస్థలు, విక్రయదారులు మార్కెట్‌కు పంపే నిల్వలను తగ్గించినట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది.
ఈ పరిస్థితుల్లో శామ్‌సంగ్ 17% మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. తొమ్మిది త్రైమాసికాల తర్వాత మొదటి స్థానానికి చేరిన ఈ సంస్థకు గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ల అమ్మకాలు తోడ్పడ్డాయి. వివో 16% వాటాతో రెండో స్థానంలో నిలవగా, ఒప్పో 12% వాటాను నమోదు చేసింది. షావోమీ, యాపిల్ సహా ఇతర బ్రాండ్ల పనితీరులోనూ మార్పులు కనిపించాయి. మరోవైపు భారతీయ బ్రాండ్ల మార్కెట్ వాటా పెరగడం, ఏఐ+ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వార్షిక షిప్‌మెంట్లలో 306% వృద్ధిని నమోదు చేయడం ఈ త్రైమాసికంలోని ముఖ్య పరిణామాలుగా నిలిచాయి.