భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

చేగుంటలో కాలుష్యంపై ఎమ్మెల్యే సీరియస్‌

చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాలి- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చేగుంట మండల కేంద్రంలోని జీవీకే ఇండస్ట్రీ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో చిన్న స్థాయిలో ఉన్న జీవీకే ఇండస్ట్రీ ప్రస్తుతం సుమారు 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణానికి విస్తరించిందని MLA తెలిపారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న నల్లటి పొగ, దుమ్ముతో చుట్టుపక్కల ఏడు నుంచి ఎనిమిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వెలువడే పొగ, దుమ్ము ఇళ్లలోకి చేరుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

పరిశ్రమ కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు ప్రజల్లో ఉన్నాయని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గాలి నాణ్యత దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పరిశ్రమకు భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడటం ఆందోళనకరమన్నారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాలి- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్..

గ్రామీణ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు

చేగుంట పరిసర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలని, హైదరాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక ప్రాంతాల మాదిరిగా వీటిని చూడకూడదని MLA స్పష్టం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గ్రామాల్లో నివసించే ప్రజలు, చిన్నారులు, పాఠశాలలపై ప్రభావం చూపకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జీవీకే ఇండస్ట్రీ విస్తరణకు అవసరమైన అనుమతులు పొందిందా? కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తోందా? పర్యావరణ అనుమతులు ఉన్నాయా? ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారా? అనే అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడాలి- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్..

అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ అధికారులు వెంటనే స్పందించి జీవీకే ఇండస్ట్రీ పరిసర గ్రామాల్లో పర్యటించాలని MLA కోరారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము తీవ్రతను పరిశీలించడంతో పాటు గాలి నాణ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

పరిశీలనలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సమస్యకు పరిష్కారం చూపాలని కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.