భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడటంలో పీఎం రాహత్ పథకం కీలకంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రులకు తరలించి, గోల్డెన్ అవర్‌లో చికిత్స అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య సమన్వయం, చికిత్స ఖర్చుల చెల్లింపులపై సమీక్షించారు.
పోలీసుల ఆమోదం పొందిన కేసుల్లో ఈ పథకం ద్వారా ఒక్కో బాధితుడికి గరిష్టంగా ₹.1.50 లక్షల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల ప్రాణాలను కాపాడటంలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని, ఆ సమయంలో వైద్యం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎస్ స్పష్టం చేశారు.
పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణ
పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలతో సమన్వయం చేసుకోవాలని సంజయ్ జాజు సూచించారు. జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ప్రమాదాల నివారణతో పాటు బాధితుల వివరాలను పారదర్శకంగా నమోదు చేసేందుకు TMS 2.0 పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.
జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బాధితుల చికిత్స ఖర్చులను నేరుగా ఆసుపత్రులకు చెల్లించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర సేవల కోసం 112, CCTNS వ్యవస్థల అనుసంధానం ద్వారా బాధితులకు వేగంగా సేవలు అందేలా చూడాలని తెలిపారు. ప్రతి జిల్లాలో పథకం అమలు తీరును కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
బాధితులకు తక్షణ వైద్యం అందించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే వైద్య సేవలు అందించి, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమై, బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. నగదు అందుబాటులో లేకపోవడం లేదా బాధితుల వివరాలు వెంటనే లభించకపోవడం వంటి కారణాలతో వైద్య సేవలను నిరాకరించకూడదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు చికిత్స అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
పోలీసులు, వైద్య, రవాణా తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణా శాఖ అధికారి చక్రవర్తి, రవి తేజతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.