భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలుకు పంపించినట్లు ఎస్సై గంగారపు కరుణాకర్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన నన్నబోయిన (జక్కుల పుల్లయ్య) న్యాయస్థానం నిర్ణయించిన వాయిదాలకు హాజరుకాకపోవడంతో సంబంధిత తొర్రూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మేచరాజుపల్లిలోని తన ఇంటి వద్ద నన్నబోయిన (జక్కుల పుల్లయ్య)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
కోర్టు వాయిదాలకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా హాజరుకావాలని ఎస్సై కరుణాకర్ సూచించారు. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తూ తప్పించుకుని తిరిగేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.