భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నిర్మల్ జిల్లాలో చోరీల ముఠా గుట్టురట్టు.. భారీ రికవరీ

వరుస దొంగతనాలు కేసును చేధించి రికవరీ చేసిన పోలీసులు

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇళ్లు, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను భైంసా రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 170 తులాల వెండి, 13 గ్రాముల బంగారం, ₹.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు భైంసా ఏఎస్పీ సాయికిరణ్ వెల్లడించారు.

జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండటంతో అప్రమత్తమైన భైంసా రూరల్ పోలీసులు కేసులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి, ఆగస్టులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తన కార్యాలయంలో వెల్లడించారు.

భైంసా, లోకేశ్వరం, నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో జరిగిన చోరీల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు విచారణలో గుర్తించామని తెలిపారు. ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన అర్సలా పెద్ద సాయన్న, బుడుబుడుకల గంగన్న, బ్రహ్మంగావ్‌కు చెందిన సంగోళ్ల భూమేష్, నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన బైరుపుల పండరి, కుమార్‌ కలిసి ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఇళ్లు, ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 14న నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించగా, వారి వద్ద నుంచి 170 తులాల వెండి, 13 గ్రాముల బంగారం, ₹.22 వేల నగదును రికవరీ చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ వివరించారు.

జిల్లా ఎస్పీ జనకి షర్మిల ఆదేశాల మేరకు, భైంసా ఏఎస్పీ సాయికిరణ్ పర్యవేక్షణలో భైంసా రూరల్ సీఐ, ఎస్‌ఐల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. వరుస చోరీల కేసులను ఛేదించడంలో చురుకుగా వ్యవహరించిన పోలీసు బృందాన్ని ఏఎస్పీ అభినందించారు.