భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలకు చెక్.. కలెక్టర్ కీలక చర్యలు

బాసర ట్రిపుల్ ఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో నీటి కొరత సమస్యపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పందించారు. క్యాంపస్‌లో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.

సోమవారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా.. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్‌తో కలిసి కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. క్యాంపస్‌లో నీటి సరఫరా పరిస్థితిని వివరించి, సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

బాసర ట్రిపుల్ ఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు

ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 10 వేల మంది వరకు ఉంటారని కలెక్టర్ తెలిపారు. వీరికి తాగునీటితో పాటు రోజువారీ అవసరాల కోసం ప్రతిరోజూ దాదాపు 15 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుందని చెప్పారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

గోదావరి నది వద్ద ట్రిపుల్ ఐటీ కోసం 60 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు అందుబాటులో ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఒక మోటారు మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా, మరో రెండు మోటార్లు పనిచేయడం లేదని కలెక్టర్ వెల్లడించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే మోటార్ల మరమ్మతుల కోసం ₹.8 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటికే సాంకేతిక నిపుణుల బృందం ఇంటెక్ వెల్‌ను సందర్శించిందని, మరో పది రోజుల్లో రెండు మోటార్లను మరమ్మతు చేసి తిరిగి నీటి సరఫరాకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

బాసర ట్రిపుల్ ఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు

ప్రస్తుతం పనిచేస్తున్న ఒక్క మోటారు రోజుకు దాదాపు 25 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయగలదని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సామర్థ్యం ట్రిపుల్ ఐటీ రోజువారీ అవసరాలకు సరిపోతుందని వివరించారు. భవిష్యత్తులో పెరిగే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో కొత్త మోటారును కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఒకవేళ క్యాంపస్ అవసరాలకు అదనంగా నీరు అవసరమైతే గ్రామపంచాయతీ ఇంటెక్ వెల్ ద్వారా నీటిని సరఫరా చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆ వ్యవస్థ ద్వారా రోజుకు 10 లక్షల లీటర్ల నీటిని అందించే సామర్థ్యం ఉందని, అవసరాన్ని బట్టి 1.3 నుంచి 1.5 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో పాటు గ్రామపంచాయతీ నీటి ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు.

ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 29 ఎకరాల విస్తీర్ణంలో నీటి నిల్వ కుంట అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. ఆ కుంటను శుభ్రం చేసి, మరింత సమర్థంగా ఉపయోగించుకునేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నీటి అవసరాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని, విద్యార్థులకు మరో రెండు, మూడు రోజుల్లో భౌతిక తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భవేశ్ మిశ్రా వెల్లడించారు.